డిటెక్టివ్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలంటే యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులు అమితాసక్తి చూపిస్తారనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సంచలన విజయాలు సాధించి,ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందిన పలు డిటెక్టివ్ చిత్రాల గురించి 'నవచిత్రం' పాఠకులకు ఈ వారం అందిస్తున్న స్పెషల్ 'షో'...
షార్ట్ టర్మ్ మెమరీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఒక వింత వ్యవస్థను సృష్టించుకోవడమనే ఇతివృత్తంతో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ 2000లో రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం 'మెమెంటో'. లియోనార్డ్ అనే వ్యాపారవేత్త ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. సరదాగా సాగుతున్న క్రమంలో లియోనార్డ్ భార్యని విలన్లు చంపేస్తారు.
అతన్ని కూడా బాగా కొట్టడంతో తలకు బలంగా గాయమై గతాన్ని మర్చిపోయి షార్ట్ మెమరీ పెషెంట్‌గా మారతాడు. అప్పన్నుంచి తను చేయాలనుకున్న పనులను ఫొటో రూపంలో గుర్తు పెట్టుకుని, తన భార్యను చంపిన దుండగులను రహస్యంగా చంపడమనేది ఈ చిత్రం ఇతివృత్తం. ఇందులో లియోనార్డ్ పాత్రలో గే పియర్స్ నటించి మెప్పించారు. ఈ చిత్రం విశేషప్రేక్షకాదరణతోపాటు నాలుగు కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.షార్ట్ టర్మ్ మెమరీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఒక వింత వ్యవస్థను సృష్టించుకోవడమనే ఇతివృత్తంతో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ 2000లో రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం 'మెమెంటో'. లియోనార్డ్ అనే వ్యాపారవేత్త ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. సరదాగా సాగుతున్న క్రమంలో లియోనార్డ్ భార్యని విలన్లు చంపేస్తారు.
లాస్ ఏంజెల్స్ నగరంలో మున్సిపల్ వాటర్ సప్లై అధికారిగా పనిచేస్తున్న హోలిస్ ఓ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతోపాటు వాటర్ రిజర్వాయర్ విషయంలోనూ అవినీతికి పాల్పడుతూ, అడ్డొచ్చిన వారిని చంపించేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఎవిలిన్, అతని ఆగడాలను బయటపెట్టడానికి ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ను సంప్రదిస్తుంది. ఆ డిటెక్టివ్ ద్వారా మున్సిపల్ అధికారి అవినీతిని ఎలా బట్టబయలు చేశారనే ఇతివృత్తంతో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు రోమన్ పోలాన్క్సీ 'చైనా టౌన్' చిత్రాన్ని రూపొందించారు. 1974లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రం అమెరికాలోని కాంగ్రెస్ లైబ్రరీలో చోటు సంపాదించింది. అలాగే చరిత్రపరంగా, సంస్కృతి పరంగా ప్రపంచంలోనే గొప్ప సినిమాగా అభివర్ణించబడింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్లను రాబట్టింది.
ఏడు ఘోరమైన పాపాలు చేసి వరుస హత్యలకు పాల్పడుతున్న నేరస్తులను ఇద్దరు డిటెక్టివ్స్ కనిపెట్టి వారిని అంతమొందించడమనే ఇతివృత్తంతో రూపొం దించిన అమెరికన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'సెవెన్'. డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1995లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రల్లో బ్రాడ్ పీట్, మోర్గాన్ ఫ్రీమాన్‌లు నటించారు. వారి నటన సినిమాకే హైప్ తెచ్చింది. దాదాపు 33 కోట్ల డాలర్లు వసూలు చేసి 1995లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్ల రాబట్టిన ఏడవ చిత్రంగా నిలివడం విశేషం.
సంపన్న కుటుంబంలో జన్మించిన ఒక అమ్మాయి నలభై ఏళ్ల క్రితం తప్పిపోతుంది. ఆమెను కనిపెట్టడానికి కంప్యూటర్ హ్యాకర్స్ చేసే లిస్‌బెత్ సలెండర్ సహాయంతో మైకేల్ బ్లోమిక్విస్ట్ అనే జర్నలిస్ట్ చేసిన పరిశోధన నేపథ్యంతో డేవిడ్ ఫించర్ రూపొందించిన స్వీడిష్ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'ద గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ'. ఈ చిత్రాన్ని రచయిత స్టెయిగ్ లార్సన్ రాసిన 'ద గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ' అనే నవల ఆధారంగా 2011లో తెరకెక్కించారు. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో డేనియల్ క్రెయిగ్, కంప్యూటర్ హ్యాకర్ పాత్రలో రూనీ మారా నటించారు. వీరి నటన ఆద్యంతం అలరించడంతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఎడిటింగ్‌లో ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ఈ చిత్రం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. అలాగే 23కోట్ల డాలర్లకుపైగా కలెక్షన్లను రాబట్టి సత్తాచాటింది.
1950 సమయంలో లాస్ ఏంజెల్స్‌లో అవినీతి భారీగా పెచ్చరిల్లి ప్రభుత్వ శాఖల నుంచి ప్రైవేట్ వ్యక్తుల వరకు అన్ని రంగాల్లో కుంభకోణాలు పెరిగిపోతున్న క్రమంలో ముగ్గురు పోలీస్ అధికారులు తమకు నచ్చిన దారిలో వెళ్లి అవినీతి పరులను అంతం చేయడమనే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం 'లాస్ ఏంజెల్స్ కాన్ఫిడెన్షియల్'. జేమ్స్ ఎల్‌రారు 1990లో రాసిన 'ఎల్ ఎ కాన్ఫిడెన్షియల్' అనే నవల ఆధారంగా 1997లో దర్శకుడు కర్టిస్ హాన్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముగ్గురు పోలీస్ అధికారుల పాత్రల్లో కెవిన్ స్పైసీ, రస్సెల్ క్రో, గే పియర్స్ నటించి తమదైన ప్రత్యేక నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ఎన్నో అంతర్జాతీయ అవార్డులతో పాటు ఉత్తమ సహాయ నటి, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. సుమారు 13 కోట్ల డాలర్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.
ట్రక్‌ను హైజాక్ చేసిన కేసులో అనుమానితులుగా ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ చేయబడి పోలీస్ విచారణను ఎదుర్కొంటారు. ఆ విచారణలో పోలీస్‌లు కఠినంగా వ్యవహరించడంతో వారిపై కోపం పెంచుకుని పగ తీర్చుకోవాలనుకుంటారు. పగ తీర్చుకునే క్రమంలో ఓ రహస్య నేరస్తుడు వీరి పనులు చూసి తనతో కలిసి పనిచేయమని చెప్తాడు. ఓ రోజు అనుకోకుండా పడవ ప్రయాణంలో 27 మంది చనిపోతారు. ఆ ఘటనని ఈ ఐదుగురే చేశారని ఆరోపిస్తారు. కాని చేసింది మాత్రం ఆ రహస్య నేరస్తుడు. మరి ఇంతకి అసలైన నేరస్తుడి మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారనే ఇతివృత్తంతో తెరకెక్కిన అమెరికన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'ద యూజ్‌వల్ సస్పెక్ట్స్'. 1995లో విడుదలైన ఈ చిత్రానికి బ్రయాన్ సింగర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఐదు పాత్రల్లో స్టీఫెన్ బాల్డ్విన్, గాబ్రియేల్ బైరన్, బెనిసియో డెల్ టోరో, కెవిన్ పొల్లాక్, కెవిన్ స్పైసీ నటించారు. వీరి నటన ఓ వైపు కామెడీని పంచుతూనే, మరోవైపు ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతుంది. ఆసక్తికర మలుపులతో సాగే ఈ చిత్రం ప్రపంచ సినీ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలందుకుంది.
డిటెక్టివ్ షెర్లాక్, అతని అసిస్టెంట్ వాట్సన్‌తో కలిసి ఇంగ్లాండ్‌పై దాడి చేయాలనుకున్న కొందరు శత్రువులను తమ బుద్ధిబలంతో, కండబలంతో ఎదుర్కోవడమనే ఇతివృత్తంతో రూపొందించిన యాక్షన్ మిస్టరీ చిత్రం 'షెర్లాక్ హోమ్స్'. సర్ ఆర్థర్ కోనన్ డోయల్ అనే రచయిత సృష్టించిన పాత్ర ఆధారంగా దర్శకుడు గె రిట్చీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో షెర్లాక్ పాత్రలో రాబర్ట్ డౌనీ, జాన్ వాట్సన్ పాత్రలో జుడ్ లా నటించి మెప్పించారు. 2009లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. విశేష ప్రేక్షకాదరణతోపాటు సినీ విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకుంది. అలాగే అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి అవార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా 52 కోట్ల డాలర్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. వీటితోపాటు 'ద మాల్టీస్ ఫాల్కన్', 'బ్రిక్', 'డర్టీ హ్యారీ', 'ఏస్ వెంచూరా: పెట్ డిటెక్టివ్', 'ఫార్గో', 'టింకర్ టైలర్ సోల్జర్ స్పై', 'గాన్ బేబీ గాన్', 'టాండ్ అండ్ క్యాష్', 'హు ఫ్రేమ్‌డ్ రోజర్ రాబిట్', 'ద ఫ్యుజిటివ్', 'వర్టిగో', 'షట్టర్ ఐల్యాండ్', 'ద పింక్ పాంథర్', 'ది డిపార్టెడ్', 'మిస్టిక్ రివర్', 'లక్కీ నంబర్ స్లెవిన్', 'ఏంజిల్స్ అండ్ డెమన్స్', 'రేర్ విండో' వంటి చిత్రాలు డిటెక్టివ్ నేపథ్యంలో వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందాయి. పలు జాతీయ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమై విమర్శకులు ప్రశంసలందుకున్నాయి. ఆస్కార్ అవార్డులతోపాటు భారీ కలెక్షన్లను సాధించి ఉత్తమ డిటెక్టివ్ సినిమాల జాబితాలో స్థానం సంపాదించాయి.
No comments:
Post a Comment