News

Title

joel sutherland

Wednesday 28 October 2015

అజాత శత్రువుగా...

నాగబాబు.. అభిరుచి గల నిర్మాతగా, నటుడిగా అన్నింటికంటే మంచి మనసున్న వ్యక్తిగా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చవిచూసినా ధైర్యంగా నిలబడి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. సినిమాల్లోని ముఖ్యపాత్రల్లోనే కాకుండా సీరియల్స్‌, 'జబర్దస్త్‌' కామెడీ షోతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న నాగబాబు పుట్టినరోజు నేడు (గురువారం). ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన గురించి 'నవచిత్రం'పాఠకులకు ప్రత్యేకం..

      1961లో పశ్చిగోదావరి జిల్లా మొగల్తూరులో నాగబాబు జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట్రావు, తల్లి అంజనాదేవి. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా రాణిస్తున్న రోజుల్లో సినీ రంగ ప్రవేశం చేసిన నాగబాబు హీరోగా ఒకటి రెండు చిత్రాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా సక్సెస్‌ కాలేకపోయాయి. దీంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నాటి నుంచి నేటి వరకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలకి నాగబాబు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 'కౌరవుడు' చిత్రంలోని ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన ఆయన 'ప్రేమాభిషేకం', 'చండీ', 'మృగరాజు', 'అన్నవరం', 'అమ్మ చెప్పింది', 'రాక్షసుడు', 'మురారి', 'అంజి', '420', 'కొండవీటి దొంగ', 'మరణ మృదంగం', 'త్రినేత్రుడు', 'ఆపరేషన్‌ దుర్యోదన', 'శ్రీ రామదాసు', 'చందమామ', 'ఆరెంజ్‌', 'మిరపకారు' లతోపాటు ఇటీవల వచ్చిన 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారు. అలాగే నిర్మాతగా భారీ చిత్రాలను రూపొందించారు. 'అంజనా ప్రొడక్షన్‌' పతాకంపై అన్నయ్య చిరంజీవితో 'రుద్రవీణ' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జాతీయ అవార్డును తెచ్చి పెట్టడంతోపాటు పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శింపబడింది. తొలి చిత్రమే సంచలన విజయం సాధించడంతో నిర్మాణ రంగం వైపు మరింత ఆసక్తి చూపారు. తర్వాత 'త్రినేత్రుడు', 'ముగ్గురు మొనగాళ్ళు', 'బావగారు బాగున్నారా', 'గుడుంబా శంకర్‌', 'స్టాలిన్‌' వంటి చిత్రాలను నిర్మించారు. రామ్‌చరణ్‌ హీరోగా నిర్మించిన 'ఆరెంజ్‌' సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీ నష్టం రావడంతో ఆర్థికంగా బలహీన పడిన తరుణంలో సైతం మొక్కవోని ధైర్యంతో మళ్ళీ పుంజుకున్నారు. ఆత్మస్థయిర్యాన్ని పెట్టుబడిగా పెట్టి పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడ్డారు. నాగబాబు పనైపోయిందని అనుకున్నవారంతా ఆశ్చర్యపోయేలా మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో సక్సెస్‌ సాధించారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇదే తరుణంలో ఆద్యంతం నవ్వుల్ని పండించే 'జబర్దస్త్‌' కామెడీ షో నాగబాబును సక్సెస్‌బాటలోకి తీసుకొచ్చింది. వీటితోపాటు పలు టీవీ సీరియల్స్‌లోనూ మంచి పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సినిమా, సీరియల్స్‌కే పరిమితమవ్వకుండా ఆర్థికంగా చితికిపోయిన ఆర్టిస్టులకు ఎంతో కొంత మేలు జరగాలని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)కు తన పూర్తి సహాయ సహకారాల్ని అందిస్తున్నారు. నాగబాబుని స్ఫూర్తిగా తీసుకుని పలువురు సినీ ప్రముఖులు సైతం 'మా' కార్యక్రమాలు విజయవంతమవ్వడానికి కృషి చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగానో, పవన్‌కళ్యాణ్‌ అన్నయ్యగానో ఆయన ఏనాడూ హంగూ ఆర్భాటాలకు వెళ్ళలేదు. కుటుంబ సమస్యనైనా, అభిమానుల సమస్యనైనా సమయస్ఫూర్తితో పరిష్కరించటంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు ఎటువంటి విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పేస్తారు. పరిశ్రమలోని అందరితో కలిసిపోయి అజాతశత్రువుగా పేరొందారు. అలాగే తనయుడు వరుణ్‌ తేజ్‌ను శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'ముకుంద' చిత్రంతో తెరంగేట్రం చేయించారు. తాజాగా క్రిష్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'కంచె' చిత్రం పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే కూతురు నిహారిక కూడా టీవీ షోస్‌ యాంకర్‌గా రాణిస్తున్నారు. త్వరలో నిహారికను కూడా హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ చేయబోతున్నారని తెలిసింది. తండ్రికి బాసటగా నిలిచే పిల్లలుగా వరుణ్‌తేజ్‌, నిహారిక ఇప్పటికే మంచి పేరు తెచ్చు కున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. అయితే వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారనేది ఆయా వ్యక్తుల ఆలోచనాధోరణిని బట్టి ఉంటుంది. నాగబాబు సినీ ప్రస్థానంలో 'ఆరెంజ్‌'కి ముందు, 'ఆరెంజ్‌'కి తర్వాత అనే ఫేజ్‌ల్ని పరిస్థితులు సృష్టించినా ఆత్మవిశ్వాసం, చిరునవ్వు అనే ఆయుధా లతో ఎదుర్కొని మళ్ళీ సక్సెస్‌బాటలో పయనిస్తున్నారు.

No comments: